Sunday, November 24, 2024

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ప్రమాణం

  • ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరుల హాజరు
  • కోవిద్ నిబంధనల కారణంగా పరిమితంగా ఆహ్వానితులు

దిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జస్టిస్ రమణ చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ రమణ 26 ఆగస్టు 2022 వరకూ ప్రధాన న్యాయమూర్తి పదవిలో కొనసాగుతారు. 27 ఆగస్టు 1957న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లాలోని పొన్నవరం గ్రామంలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రమణ అంచెలంచెలుగా పైకి ఎదిగారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ బీ చదివారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు.

కోకా సుబ్బారావు తర్వాత మరో తెలుగు ప్రధాన న్యాయమూర్తి

ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ప్రమాణస్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులూ హాజరైనారు. సుమారు 55 ఏళ్ళ కిందట రాజమండ్రికి చెందిన కోకా సుబ్బారావు దేశ ప్రధాన న్యాయమూర్తిగా పదినెలల పాటు పని చేశారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేయవలసి రావడంతో గడువుకు ముందుగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఐదున్నర దశాబ్దాల తర్వాత ఈ అత్యున్నత పదవి మరో తెలుగు వ్యక్తికి దక్కింది. తెలుగు వ్యక్తి కావడమే కాకుండా తెలుగు భాషపట్ట మక్కువ ఎక్కువగా కలిగిన న్యాయమూర్తి కావడం జస్టిస్ రమణలోని విశేషం.

సుప్రీంకోర్టు జడ్జిగా ఏడేళ్ళు

జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 13 సంవత్సరాలు పని చేశారు.అనంతరం దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 17 ఫిబ్రవరి 2014న బాధ్యతలు స్వీకరించారు. ప్రజాస్వామిక హక్కులకు అనుకూలమైన న్యాయమూర్తిగానూ, నేర రాజకీయాల నిర్మూలన విషయంలో పట్టింపు కలిగిన న్యాయకోవిదుడుగానూ, కంపెనీలు మూతబడినప్పుడు వాటిలో పని చేసే ఉద్యోగుల బతుకుతెరువు గురించి ఆలోచించిన న్యాయమూర్తిగానూ జస్టిస్ రమణ పేరు తెచ్చుకున్నారు.

రాజకీయవాదులపై కేసుల పరిష్కారంపై దృష్టి

జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఎంపీలూ, ఎంఎల్ఏలపైన ఉన్న క్రిమినల్ కేసుల జాబితాను సత్వరం తయారు చేయాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశిస్తూ 17 సెప్టెంబర్ 2019న ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలూ, ఎంఎల్ఏలపైన ఉన్న క్రిమినల్ కేసులను సత్వరం విచారించేందుకు చర్యలు చేపట్టాలనీ, ఈ ప్రక్రియను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు స్వయంగా పర్యవేక్షించాలనీ ధర్మాసనం ఆదేశించింది. నేరస్థ రాజకీయాలు పెరిగిపోవడమే కాకుండా అధికారంలో నేరస్థులు కొనసాగితే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని ధర్మాసనం కోరింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని చెబుతూ అందుకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు:జస్టిస్ సుదర్శనరెడ్డి

‘‘మంచి వ్యక్తిత్వం ఉన్న తెలుగు వ్యక్తికి దేశ ప్రధాన న్యాయమూర్తిగా పని చేసే అవకాశం రావడం సంతోషించదగిన విషయం. ఇదొక మహత్తరమైన అవకాశం. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. నాతో కలసి డివిజన్ బెంచిలో పని చేశారు. మంచి పని చేయాలనే సంకల్పం, క్రమశిక్షణ ఆయనకు ఉన్నాయి. తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా, దర్మబద్ధంగాన నిర్వహిస్తారని ఆశించవచ్చు. ఇందులో ఎవ్వరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు,’’ అంటూ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూరి జస్టిస్ బీ సుదర్శనరెడ్డి అన్నారు.

మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి, తెలాంణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ చైర్మన్ గంటా రామారావు, తదితరులు కూడా జస్టిస్ రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షం ప్రకటించారు.

ముస్లిం రిజర్వేషన్లకు ఆర్థిక ప్రాతిపదిక

ముస్లిం రిజర్వేషన్ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల దర్మాసనంలో భాగంగా మెజారిటీ సభ్యులతో ఏకీభవిస్తూనే, ముస్లిం రిజర్వేషన్లకు ఆర్థిక పరిస్థితి ప్రాతిపదిక కావాలని అన్నారు. అంతే కానీ సమాజాన్ని విభజించే కులమతాలు ప్రాతిపదిక కారాదని వ్యాఖ్యానించారు. పోలీసులు నిందితులను అక్రమంగా నిర్బంధించడాన్నీ, చిత్రహింసలకు గురిచేయడాన్నీ జస్టిస్ రమణ ఆక్షేపించారు.

గృహిణి శ్రమకూ విలువ

ఇంటిలో గృహిణి చేసే పనికి విలువ కట్టాలని జస్టిస్ రమణ 2021 జనవరిలో ఇచ్చిన ఒక తీర్పులో స్పష్టం చేశారు. కశ్మీర్ లో ఇంటర్ నెట్ పైన విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. వాక్ స్వాతంత్ర్యానికీ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకూ రాజ్యాంగం హామీ ఇస్తున్నదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు చీటికీ మాటికీ విధించడంపైన కూడా ఆయన అభ్యంతరం తెలిపారు. ఒక సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక  పిటిషన్ పైన విచారణ జరుపుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకూ పదిహేను రోజులపాటు మద్యం దుకాణాలను తెరవకూడదని ఆదేశాలు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి విడాకుల కోసం కోర్టు గుమ్మం తొక్కినప్పుడు ఆ వివాహాన్ని కాపాడేందుకే జస్టిస్ రమణ మనస్పూర్తిగా ప్రయత్నించేవారు.

రాజకీయ సంక్షోభాలు

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రినీ, స్పీకర్ నూ సంప్రదించకుండా గవరనర్ శాసనసభసమావేశాలను ముందుకు జరుపుతూ జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ రమణ కొట్టివేశారు. శాసనసభ ఔచిత్యాన్నీ, రాష్ట్రాల అధికారాలనూ కాపాడారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ , పబ్లిక్ పాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగిన పౌరులకు న్యాయం అందించాలని అంటారు. నేరాలకు తగిన మోతాదులోనే శిక్షలు ఉండాలని వాదించే న్యాయమూర్తులలో జస్టిస్ రమణ ఒకరు.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles