Monday, December 23, 2024

భారత్, చైనా ధృతరాష్ట్ర పరిష్వంగం

భారతదేశం – చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోడానికి రెండు దేశాలు చర్యలు చేపట్టాయి. ఈ దిశగా గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే వున్నాయి. తాజాగా శుక్రవారంనాడు జరిగాయి. ఇది 11వ సారి. గతంలో అనేక విడతల్లో జరిగిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో  ఉభయ దళాల ఉపసంహరణ జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ప్రశాంతమైన వాతావరణమే నెలకొని ఉంది. లడాఖ్ లోని హాట్ స్ప్రింగ్, గోగ్రా, డెప్సాంగ్ లో కూడా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో రెండు దేశాల సైనికాధికారులు సమావేశమయ్యారు.

చైనా బలగాల ఉపసంహరణ ప్రధానం

అన్ని ప్రాంతాల్లోనూ చైనా బలగాల ఉపసంహరణ జరగాలన్నది మన డిమాండ్. తాజాగా జరిగిన చర్చల ఫలితాలు ఇంకా బయటకు వెల్లడవ్వాల్సి వుంది. గత సంవత్సరం మే నెలలో గల్వాన్ లో జరిగిన దుర్ఘటన జ్ఞాపకాల నుంచి మనం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అనంతరం, వాస్తవాధీన రేఖ వెంబడి ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. అప్పుడు భారత్ – చైనా మధ్య ఏ సమయంలోనైనా యుద్ధం జరుగవచ్చునని అందరూ భావించారు. యుద్ధానికి సన్నద్ధమవ్వడానికి కావాల్సిన సరంజామా మొత్తం సిద్ధం చేసుకున్నాము. కాకపోతే యుద్ధం జరగలేదు. యుద్ధ వాతావరణం భీభత్సంగా ఏర్పడింది.

తారాస్థాయికి చేరిన విభేదాలు

రెండు దేశాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. చైనాతో మనం చేసుకున్న ఎన్నో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకున్నాం. చైనా యాప్ లన్నింటికీ ఉద్వాసన పలికాం. చైనాకు పెద్ద శతృదేశమైన అమెరికాలో పాలక పార్టీ కూడా మారింది.డోనాల్డ్ ట్రంప్ స్థానంలో జో బైడెన్ కొత్త అధ్యక్షుడుగా వచ్చారు. చైనా మనసులో ఏమి ఆలోచించుకుందో పూర్తిగా తెలియదు కానీ, పాంగాంగ్ వద్ద బలగాలను ఉపసంహరించుకుంది. మనం కూడా అదే పనిచేశాం. దీనితో పెద్ద ముప్పు తప్పింది. ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా ఉన్నా చైనాతో ముప్పు పూర్తిగా తప్పిపోలేదని మన ఆర్మీ జనరల్ ఎంఎం నరవాణే గతంలో ఒకసారి వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధవంతమైనవే. తాను శతృవులుగా భావించేవారిని అదను చూసి దెబ్బకొట్టడం చైనాకు కొత్త ఏమీ కాదు. మనకూ – చైనాకు గతంలో రెండు సార్లు జరిగిన యుద్ధాలే ప్రత్యక్ష ఉదాహరణలు.

ఇరుగుపొరుగుల మధ్య సఖ్యత అవసరం

ఇరుగుపొరుగు దేశాల మధ్య సఖ్యత ఉండడం ఎంతో అవసరం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి సదా ఆచరణనీయం. ఆ సిద్ధాంతాలతోనే చైనా విషయంలో భారతదేశం ఎంతో సహనం పాటించింది, ఆచితూచి అడుగులు వేస్తోంది. రెండు దేశాలకు ఒకరితో ఒకరికి ఉండే అవసరాల దృష్ట్యా, గత కొన్ని నెలల నుండి సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాకిస్తాన్ – ఇండియా మధ్య కూడా కొన్ని రోజుల నుంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతోంది. జమ్మూ కశ్మీర్ తో పాటు అన్ని సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాలకు కట్టుబడి ఉందామని రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.కారణాలు ఏవైనా కావచ్చు, ఇది  మంచి పరిణామమే.ఇది ఎంత కాలం ఉంటుంది అనే విషయాన్ని కొంచెంసేపు పక్కన పెడదాం.

భారత్-పాక్ కదలికలను గమనిస్తున్న చైనా

భారత్ – పాకిస్తాన్ మధ్య ఏర్పడుతున్న ఈ పరిణామాలను చైనా అత్యంత ఏకాగ్రతగా గమనిస్తోందన్న విషయం మనం మరువరాదు. చైనా మనల్ని పూర్తిగా పోటీ దేశంగానే భావిస్తోంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జనాభా, వనరులు దృష్ట్యా, భారత్ ప్రపంచంలోనే పెద్ద మార్కెట్ కేంద్రం, అన్న విషయం చైనాకు బాగా తెలుసు. ఆన్నీ కలిసి వస్తే, భవిష్యత్తులో భారతదేశం తమకు సమానమైన దేశంగా అభివృద్ధి చెందుతుందనే అనుమానం కూడా ఉంది. అందుకే, చైనా మన విషయంలో సందర్భోచితంగా ప్రవర్తిస్తోంది. పాకిస్తాన్ ను ఇప్పటి వరకూ మనపై ఒక పావులా వాడింది. ఆ అభ్యాసం కొనసాగిస్తూనే ఉంటుంది.

చైనా, పాక్ ల మధ్య బలమైన మైత్రి

చైనా తమకు అత్యంత మిత్ర దేశమని ఇటీవలే, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఘనంగా స్వాగతిస్తున్నామంటూ, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలో, ఇరుదేశాలు తమ దృఢమైన స్నేహబంధాన్ని మరోసారి చాటుకున్నాయి. ఆ రెండు దేశాల విషయంలో భారత్ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. తాజాగా బంగ్లాదేశ్ – భారత్ మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రగతి దిశగా అడుగులు మొదలయ్యాయి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన బంగ్లాదేశ్ పర్యటన దానికి బీజం వేసింది. బంగ్లాదేశ్ – చైనా మధ్య చాలాకాలం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ కు భారత్ తో కంటే, చైనాతోనే ఎక్కువ మైత్రి వుంది.

సరిహద్దు దేశాలకు చైనా తాయిలాలు

భారత్ సరిహద్దు దేశాలన్నింటికీ చైనా అనేక తాయిలాలు సమర్పిస్తూ ఎరవేస్తూనే ఉంది. రష్యా – భారత్ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కూడా కారణం చైనాయే.ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలసి ” క్వాడ్ ” గా ఏర్పడ్డాయి. చైనా దుందుడుకు చర్యలకు పగ్గం వేయడమే ఈ దేశాల ప్రధాన లక్ష్యం. క్వాడ్ ఏర్పాటు, సమావేశాలపై చైనా గుర్రుగానే వుంది. ఈ విషయంలో, రష్యాకు కూడా కోపం ఉంది. ఇవన్నీ చైనా – భారత్ సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి. ఏది ఏమైనా, జిన్ పింగ్ ఏలుబడిలో,  చైనా – భారత్ బంధాలు ధృతరాష్ట్ర కౌగిలింతలే.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles