Sunday, November 24, 2024

కనిపిస్తున్న కరోనా వాక్సిన్ కిరణం

  • ఇండియాలో రష్యా వాక్సిన్ ప్రయోగానికి అనుమతి
  • టీకా రవాణా, పంపిణీపై ప్రధాని విస్తృత సమీక్ష
  • ప్రజారోగ్య సిబ్బందికి ముందుగా వాక్సిన్
మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్,
కాలమిస్ట్

జనవరి 2021 కల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య ఒక వ్యాఖ్య చేశారు. త్వరలోనే ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్ అందేలా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తాజాగా భరోసా ఇచ్చారు. కొన్ని కంపెనీల వ్యాక్సిన్లు జనవరిలో, మరికొన్ని మార్చిలో, ఇంకొన్ని జులై లోపు అందుబాటులోకి వస్తాయనే వార్తలు బలంగా వస్తున్నాయి. వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే క్రమంలో యిద్ధ ప్రాతిపదికన కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. టీకా పంపిణీ, సరఫరా, రవాణా మొదలైన అంశాలపై ప్రధాని విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, సమీక్షించడం అభినందనీయం. దీన్ని  మంచి పరిణామంగా అభివర్ణించాలి. ఎన్నికలకు, విపత్తుల సమయంలో ఏ రీతిన ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తాయో, అదే తీరున, అదే స్ఫూర్తితో కోవిడ్-19 విషయంలోనూ ముందుకు సాగాలని యావన్మందికీ ప్రధాని దిశానిర్దేశం చేశారు. దేశ జనాభా, విస్తీర్ణం, భౌగోళిక స్థితిగతులను, ఆరోగ్య ప్రాధామ్యాలను దృష్టిలో పెట్టుకొని సాగాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ నిల్వలకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ ఏర్పాట్లు, పంపిణీ, వయల్స్, సిరంజీల వంటివి సరిపడా అందుబాటులో ఉంచుకోవాలి.

పొరుగు దేశాలతో సహకారం

దేశంలో అభివృద్ధి చేస్తున్న మూడు టీకాల్లో రెండు రెండో దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఒక టీకా మూడవ దశలో ఉంది. అఫ్ఘనిస్తాన్, భూటాన్ మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మారిషస్, శ్రీలంక వంటి పొరుగుదేశాల శాస్త్రవేత్తలతోనూ మనం సమన్వయం చేసుకుంటున్నాం. మన పరిశోధనలను మెరుగు పరచుకోడానికి ఈ సమన్వయం తప్పకుండా ఉపయుక్తమవుతుంది. మన దేశాల అవసరాలను అధిగమిస్తూనే, ఇరుగుపొరుగు దేశాలతో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాలకు కూడా కోవిడ్-19 విషయంలో సహాయ హస్తం అందించాలనే సంకల్పంలో మన ప్రభుత్వం ఉంది. ఇది హర్షదాయకం. స్వార్ధానికి అతీతంగా మిగిలిన దేశాలకు కూడా కష్టకాలంలో తోడ్పాటు అందిచడం వల్ల మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. అదే విధంగా దేశనాయకుడికి గౌరవం, పరపతి కూడా పెరుగుతాయి. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఖతార్ వంటి దేశాలు తమ దేశాల్లోనూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించమని ముందుకు వస్తున్నాయి. టీకా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగంతో పాటు వాలంటీర్లు, పౌర సమాజాలు, నిపుణులు కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది.

డిసెంబర్ కల్లా 30 కోట్ల డోసుల వాక్సిన్

ఆధునిక సాంకేతికతను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాల్సిన తరుణం ఇది. ఈ డిసెంబర్ కల్లా సుమారు 30 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధమవుతాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ ప్రకటించడం గమనార్హం. డీ సి జి ఐ నుంచి లైసెన్స్ రాగానే వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పడం ఆనందదాయకం. తుది పరీక్ష జరుపుకున్న వ్యాక్సిన్ 2021మార్చి కల్లా అందుబాటులోకి వస్తాయని సురేష్ జాదవ్ బలంగా చెబుతున్నారు. రష్యా అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ అఫ్ ఇండియా (డి  సి జి ఐ ) నుండి ఇప్పటికే అనుమతులు పొందింది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ -డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఏది ఏమైనా, 2021 ప్రథమార్ధం, ద్వితీయార్ధంలో కోవిడ్ -19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన శరవేగంగా తయారవుతున్న ఈ వ్యాక్సిన్ల సామర్ధ్యం త్వరలోనే తేలిపోతుంది.

అందరికీ అందాలంటే నాలుగేళ్ళు

భారతదేశ జనాభా 139 కోట్లకు పైగా ఉంది. అందరికీ అందాలంటే 4సంవత్సరాల వరకూ పడుతుందని కొందరు అంటున్నారు. అదే విధంగా,  ఆచరణలో సామర్ధ్యాన్ని బేరీజు వేసుకుంటూ, భవిష్యత్తులో మరికొన్ని కొత్త  వ్యాక్సిన్లను  కూడా రూపకల్పన చేసే అవసరాలు ఉత్పన్నమవుతాయనే మాటలు  మార్కెట్ లో వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి వచ్చే క్రమంలో, ఎవరెవరికి ఏ విధంగా అందించాలనే ప్రాధమ్యతలపై భారతప్రభుత్వం దృష్టి సారించింది. నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీక్ పాల్ సారథ్యంలో ఏర్పాటుచేసిన బృందం  ఈ అంశంపై ముసాయిదా నివేదికను రూపొందిస్తోంది. ప్రజారోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వయోధికులు, ఇతర వ్యాధులు ఉన్నవారికి తొలి విడతలో వ్యాక్సిన్ సరఫరా చేస్తారు. తొలి దశలో 30 కోట్లమందికి అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒక్కొక్కరికి రెండు డోసులు

ఒక్కొక్కరికి సాధారణ, బూస్టర్ రూపంలో రెండు డోసులు చొప్పున ఇస్తారని సమాచారం. ముందువరుస పోరాట యోధుల్లో (ఫ్రంట్ లైన్ వారియర్స్) జర్నలిస్టులు కూడా వున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సి వుంది.  ఈ జాబితాలో జర్నలిస్టులను తప్పకుండా చేర్చాలి. వృత్తి పరుగులో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు అసువులు బాశారు. బహుశా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందని ఆశించవచ్చు. కరోనా నుండి రక్షణ పొందడానికి వ్యాక్సిన్ ఒక రక్షణకవచంగా, సంజీవినిగా అందరూ భావిస్తున్నారు. ఆ ముచ్చట కొన్ని నెలల్లోనే తేలుతుంది. సమర్ధవంతమైన వ్యాక్సిన్లు సత్వరం అందుబాటులోకి వచ్చి, కరోనా కోరల నుండి ప్రజలు బయటపడే రోజులు త్వరలోనే వస్తాయని విశ్వసిద్దాం.రావాలని బలంగా అభిలషిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles