Monday, December 23, 2024

ఉక్రెయిన్ పై ఆధిపత్యానికి రష్యా ఆరాటం

పేరుకే చైనా కమ్యూనిస్ట్ దేశం, రష్యా నిన్నటి దాకా సోషలిస్ట్ భావాలున్న దేశం. ఆ రెండు చోట్ల ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం, నియంతృత్వ పోకడలే రాజ్యమేలుతున్నాయి. చైనా పాలకుడు జిన్ పింగ్, రష్యా పాలకుడు పుతిన్ ఇద్దరూ నియంతల్లాగానే ప్రవర్తిస్తున్నారు. ఇద్దరూ ఇండియాను ఎంత ఇబ్బంది పెడుతున్నారో, మనం చూస్తూనే వున్నాం. ప్రస్తుతం ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న వీరంగం చూస్తుంటే, సామ్యవాదం మంటగలిసిపోయినట్లేనని భావించాలి. సరిహద్దు దేశాలను ఆక్రమించుకోవాలి లేదా తమ హద్దుల్లో ఉంచుకోవాలనే నైజంతోనే చైనా, రష్యా నేతలు ముందుకు సాగుతున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య చెలరేగుతున్న వివాదం కొత్తదేమీ కాదు.

యుద్ధానికి ఒక అడుగు దూరంలో…

ఎన్నో ఏళ్ళ నుంచి కాలుతుందే. రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా రాకపోయినా, ఆ వాతావరణం కనిపిస్తోంది. ‘యుద్ధానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నాం’, అనే ప్రకటనలు రష్యా టీవీల్లో వచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.ఈ పరిణామాలు ఏ మాత్రం ఆరోగ్యదాయకం కాదు. ఉక్రెయిన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది.1991లో యూనియన్ బద్ధలై, స్వతంత్ర్య రాజ్యాలు ఏర్పడిన సందర్భంనాటి నుంచీ, రష్యా – ఉక్రెయిన్ మధ్య గొడవలు నడుస్తున్నాయి. రష్యా అన్ని రకాలుగా ఎంతో బలమైన దేశం. ఉక్రెయిన్ నిత్యం ఏదో ఒక సంక్షోభంలో మగ్గే దేశం. పైగా, ఆర్ధికంగా అంత కుదురుకున్న దేశం కూడా కాదు. బలహీనులను లొంగదీసుకోవడమే బలవంతుల పని, అని చరిత్ర చెబుతూనే ఉంది. ” ఏ దేశ చరిత్ర చూసినా, ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడనా పరాయణత్వం” అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు నేటి రష్యాకు, చైనాకు బాగా సరిపోతాయి.

ఉక్రెయిన్ కు మూడు దశాబ్దాల ఉక్కపోత

ఉక్రెయిన్ ను రష్యా ముప్పై ఏళ్ళుగా పీడుస్తూనే ఉంది.2014లో ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. ఆ విధానం కూడా పరమ అనైతికం. ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఆ చర్య జరిగింది. ఆ సందర్భంలో, ఉక్రెయిన్ మద్దతుదారులు అభిప్రాయ సేకరణ అంశాన్ని బహిష్కరించారు.90శాతం మంది రష్యా ప్రతిపాదన వైపు మద్దతు తెలిపారని నివేదికలు చెబుతున్నాయి. కానీ, అది రష్యా ఆడిన ఆటగా చాలామంది కొట్టి పారేస్తున్నారు. అయినప్పటికీ, క్రిమియాను రష్యా స్వాధీనపరచుకుంది. ఐక్యరాజ్య సమితి, మిగిలిన అంతర్జాతీయ సంస్థలు దీన్ని ఆమోదించలేదు. కానీ, రష్యా అధికారికంగా, మొన్న మార్చి 18 వ తేదీన క్రిమియాను వశపరుచుకుంది. ఉక్రెయిన్ దాన్ని ఏమాత్రం ఒప్పుకోవడం లేదు.క్రిమియా  తమదేనని అంటోంది.

రష్యా సైనికుల అలజడి

కొన్ని రోజుల నుంచీ సరిహద్దుల్లో, రష్యా సైనికుల అలజడి పెరిగింది. డాన్ బాస్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రష్యా సైనికుల చేతుల్లో నలుగురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని సమాచారం. రెండు దేశాల మధ్య కుదుర్చుకున్న కాల్పుల ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని ఉక్రెయిన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడేవారి సంఖ్య ఎక్కువ. ఈ ప్రాంతం భౌగోళికంగా రష్యాకు చాలా దగ్గర, సాంస్కృతికంగా  అనుబంధం కూడా ఎక్కువ.ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న రష్యా, ఈ ప్రాంతల్లో ఉన్న   తిరుగుబాటుదారులకు మద్దతిస్తోందని ప్రచారంలో ఉంది. అసలు, ఉక్రెయిన్ లో తిరుగుబాటుదారులను సృష్టించి, పెంచి, పోషించేదే రష్యా అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విషయంలో రష్యా చేసుకుంటున్న జోక్యాన్ని ఉక్రెయిన్ సహించడం లేదు. ఆ దేశాన్ని స్వతంత్ర్య రాజ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్తించడం లేదు.

ఉక్రెయిన్ చమురు నిక్షేపాలపైన పుతిన్ కన్ను

ఇప్పటికే, ఉక్రెయిన్ లో రష్యా భారీగా పెట్టుబడులు పెట్టింది.అక్కడుండే చమురు నిల్వలపైనా దృష్టి పెట్టింది.బ్లాక్ సీ (నల్ల సముద్రం), అజోవ్ సముద్రాల ద్వారా ఉక్రెయిన్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని నిర్వహిస్తోంది. రష్యా తన నౌకాదళాలను దించి, ఉక్రెయిన్ వాణిజ్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఈ దుష్పరిణామాల నేపథ్యంలో,రష్యాను నిలువరించడానికి, ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వాన్ని కోరుతోంది. దీన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ కు పూర్తిగా మద్దతును ప్రకటించారు. దీనితో, రష్యా – అమెరికా మధ్య వున్న అగాధాలు మరోసారి బయటపడ్డాయి.

ఆధిపత్యం పోరు ఎటు పోతుందో?

ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకుంటే,  భౌగోళికంగా, ఆర్ధికంగా తన బలం బాగా పెరుగుతుందనే వ్యూహంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. ఆధిపత్య పోరులో భాగంగా, రష్యా, చైనాల వ్యతిరేక దేశాలకు అమెరికా మద్దతు పలుకుతోంది. అందులో భాగంగానే,ఉక్రెయిన్ వైపు అమెరికా నిలుస్తోంది. తాను నిలవడమే కాక, తన మిత్రదేశాల నుంచి కూడా మద్దతును మూటగడుతోంది.ఈ సందర్భంలో, రష్యా అధినేత పుతిన్ కు ఇటీవలే అమెరికా అధినేత జో బైడెన్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అంశంలో చర్చలు జరగాలని బైడెన్ భావిస్తున్నారు. ఉక్రెయిన్ – రష్యా విభేదాలు అంటుంచగా… అమెరికా, చైనా, రష్యా వంటి పెద్ద దేశాల ఆధిపత్య పోరు ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తాయో, అనే భయం వేస్తోంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles